పెళ్లి చేసుకోవాలంటూ వివాహితపై వేధింపులు.. నిరాకరించడంతో కత్తితో పొడిచిన ఉన్మాది

  • బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • ఇంటికొచ్చి కత్తితో దాడి చేసిన యువకుడు
  •  అతడికీ పెళ్లయిందన్న పోలీసులు
పెళ్లికి ముందు ఓ మహిళతో ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా తీసుకుని తనను ప్రేమించాలంటూ ఓ ప్రబుద్ధుడు వివాహితను వేధించసాగాడు. ఆమె ససేమిరా అనడంతో ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. ఫిలింనగర్‌లోని వినాయకనగర్‌లో నివసించే మహిళ (26)కు టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఆసిఫ్ (24)తో పరిచయం అయింది. ఆ తర్వాత ఆమెకు మరో వ్యక్తితో వివాహమైంది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే, గత కొన్ని రోజులుగా ఆసిఫ్ ఆమె వెంట పడుతూ వేధించడం మొదలుపెట్టాడు. తనను ప్రేమించాలంటూ బెదిరించాడు. అతడి వేధింపులు భరించలేని ఆమె విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అతడిని నిలదీశారు. అయినప్పటికీ వేధింపులు ఆపని ఆసిఫ్ తనను పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడుతూనే ఉన్నాడు.

ఆమె నిరాకరించడంతో సోమవారం రాత్రి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడిచేశాడు. ఆమె కేకలు వేయడంతో భయపడి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆసిఫ్ దాడిలో తీవ్రంగా గాయపడిన వివాహితను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మహిళ భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి ఆరు నెలల క్రితమే వివాహమైందని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Hyderabad
Banjara hills
filmnagar
Love

More Telugu News